ఈ ప్రత్యూష వేళ మా ఇంటి ఎదురుగా ఉన్న చెట్లను చూస్తున్నాను. నిండుగా పూసిన పూల గుబుర్లలో పిచికలు, పిట్టలు రోజు మొదలైన సంరంభంలో ఉన్నాయి. పచ్చని దిరిసెన పూల చెట్ల వెనగ్గా యూకలిప్టస్ చెట్లు మృదువుగా తలలూపుతున్నాయి. నేను కూడా ఒక రోజు మొదలుపెట్టాలి. ఇటువంటి నిశ్శబ్ద నిర్వికల్ప క్షణాల్లోనే కవిత్వం ప్రభవించేది. ఈ క్షణాల్ని కవితలుగా మార్చే రహస్యం చీనా కవులకి బాగా తెలుసు. ఇట్లాంటి నిశ్చల క్షణాల్ని చిత్తరవులుగా మార్చే విద్య వాంగ్ వెయి కి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదేమో. ఒక కవితలో ఇలా చిత్రిస్తాడు:
రాత్రి వచ్చిన రహస్యపువానకి తురాయిపూలు మరింత ఎరుపెక్కాయి.
ప్రత్యూషపు పొగమంచులో వెదురు పొదల ఆకుపచ్చ మరింత వన్నె తీరింది.
కింద రాలిన పూలరేకల్నింకా ఎవరూ తుడవలేదు.
పిట్టలు పాడుతున్నాయి. కొండ మీద అతిథి ఇంకా నిద్రలేవలేదు.
No comments:
Post a Comment